తెలంగాణలో చాలామంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను ఫెయిల్ అయినప్పుడు ఫిస్టల్‌తో కాల్చుకుందాం అనుకున్నప్పుడు.. అన్నయ్య నాకు ఇచ్చిన భరోసా ఎప్పటికీ మరిచిపోను… అంటూ ఫ్లాష్‌బ్యాక్ గుర్తుచేసుకున్నారు పవన్‌కల్యాణ్. సైరా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవర్‌స్టార్ ప్రసంగం హైలైట్. కేవలం ఆ స్పీచ్ వినడానికే రెండు రాష్ట్రాల్లోని జనసేనాని అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. పవర్‌స్టార్ మాట్లాడుతున్నంతసేపూ ఫాన్స్ కేరింతలు కొడుతూనేవున్నారు. చిరంజీవి సహా అందరూ పవన్‌కల్యాణ్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
‘తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషాదాన్ని పవర్‌స్టార్ ప్రస్తావించారు. విద్యార్ధులు చనిపోయారని విన్నప్పుడు చాలా బాధ కలిగింది. నేను కూడా అన్నయ్య దగ్గర వున్న ఫిస్టల్ తీసుకుని కాల్చుకుందామని అనుకున్నాను. ఆరోజు మా వదిన గారు, నా రెండో అన్నయ్య నన్ను వారించి చిరంజీవి గారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. నువ్వు జీవితంలో గెలవాలి తప్ప.. ఇలా ఎగ్జామ్స్ అనే కొలమానంలో కాదు అని ఆరోజు అన్నయ్య ధైర్యం, గుండెబలం ఇచ్చారు. ఆ ధైర్యమే ఈరోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. అన్నయ్య లాంటి వ్యక్తులు చనిపోయిన ఇంటర్ విద్యార్థుల ఇంటిలో ఉండి ఉంటే.. ఆ పసిబిడ్డల ప్రాణాలు పోయి ఉండేవి కాదే.. అని ఎంతో బాధ కలిగింది…’ అని పవన్ ఎమోషనల్‌గా మాట్లాడారు.
‘ఆయన్ని పోటీగా తీసుకున్నవారు చాలా మంది తిట్టినా కూడా.. తిట్టిన వారి బాగును కోరుకునే వ్యక్తి అన్నయ్య. అందుకే నాకు ఆయనంటే చాలా గౌరవం. కేవలం అన్నయ్య అనే కాదు ఒక మంచి వ్యక్తిగా. మద్రాస్‌లో ఉండగా నేను కోరుకుంది ఏమిటీ అంటే.. అన్నయ్య దేశం గర్వించే సినిమాలు చేయాలని. నా కోరిక నెరవేరడానికి ఇంతకాలం పట్టింది’ అని పవర్‌స్టార్ అన్నారు.
‘ఈ వేడుకకు నన్ను అతిథిగా పిలిచినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులలో ఒకడిగా, ఒక అభిమానిగా నేను మాట్లాడుతున్నాను. అన్నయ్య ఫంక్షన్‌కు వచ్చినప్పుడు అభిమానులు అభిమానం ఎలా ఉంటుందో.. ఆ అభిమానంతో మాట్లాడుతున్నాను. నేను కూడా అలాంటి అభిమానినే. బయట నాకు ఎలాంటి పేరు ఉన్నా.. అన్నయ్య దగ్గర మాత్రం నేను ఒక అభిమానినే. సినిమా పరిశ్రమ అంటే చాలా పోటీతత్వం ఉన్న పరిశ్రమ. కానీ అన్నయ్య సినిమా అంటే మాత్రం అందరూ ప్రేమిస్తారు. ఎందుకంటే ఆయన అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈ రోజు నాకు ఇంత పేరు వచ్చిందంటే.. అదంతా అన్నయ్య నేర్పిన పాఠాల వల్లే… అంటూ పవన్‌కల్యాణ్ అన్నయ్య చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.