సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమల వెళ్తున్న కారును ఆపి తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందన్నారు.
సీఎం పర్యటన అంటే స్థానికంగా ఉండే ట్రావెల్స్ ఆపరేటర్ల నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడమే చూశామని.. ఇలా ప్రయాణంలో ఉన్నవారిని ఆపి కారు తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీఐ అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేసిందన్నారు.
రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి.. రూ.7.77 లక్షల కోట్ల అప్పులు తెచ్చుకునే సామర్థ్యం కలిగిన ఏపీ ప్రభుత్వం.. సీఎం పర్యటన కోసం ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయినా.. ముఖ్యమంత్రి భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్ లో ప్రైవేట్ వాహనాలను అనుమతిస్తారా? అని అడిగారు. ఒకవేళ అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకుంటున్నారో వివరించాలని డిమాండ్ చేశారు.
లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేకోలేని పరిస్థితిలో ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు పవన్. పాలనా వ్యవస్థలో భాగమైన ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో.. ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టారో వెల్లడి కావాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు పవన్.