రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై విచారణను హైకోర్టే సూమోటోగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై అత్యాచారాలు ఆగని పక్షంలో జనాల్లో భయం పెరిగిపోతుందన్నారు. అందుకనే అత్యాచార ఘటనలను కోర్టే విచారణకు స్వీకరిస్తే జనాల్లో కాస్త ధైర్యం వస్తుందన్నారు. హైకోర్టు చొరవ చూపించి ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు.
మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నామని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. భర్తలు ఉండగానే మహిళలపై అత్యాచారాలు చేయడం.. తలుపుకొట్టి ఇంట్లోకి దూరి దారుణాలు చాలా ఉన్నాయని అన్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతుంటే.. కుటుంబం ఎలా తమవాళ్లను రక్షించుకోగలదని ప్రశ్నించారు.
బాధ్యత గలిగిన పోలీసు అధికారులు, సిబ్బందే అత్యాచారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అభంశుభం తెలియని పసిపిల్లలు, గర్భిణులు, మానసిక పరిస్ధితి సరిగాలేని వాళ్ళపైన కూడా దాడులు, అత్యాచారాలు జరగటం బాధను కలిగిస్తున్నాయని అన్నారు.
బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలని చట్టం చెప్తుంటే.. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బాధితుల కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చే విషయాన్ని ఫొటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేయడం సరికాదని విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.