– కొండగట్టులో పవన్ కు గ్రాండ్ వెల్ కమ్
– వారాహికి ప్రత్యేక పూజలు చేసిన జనసేనాని
– అంజన్న సాక్షిగా ప్రచార రథం పైనుంచి తొలి స్పీచ్
– పొత్తులపై కీలక వ్యాఖ్యలు
– మరోసారి తెరపైకి మూడు ఆప్షన్స్
– ఎన్నికలకు వారం ముందు క్లారిటీ వస్తుందన్న పవన్
– తెలంగాణ జనసేన లీడర్లతోనూ ప్రత్యేక భేటీ
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహి కి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ వారాహి పైనుంచి తొలిసారి ప్రసంగించారు. కొండగట్టు ఆలయం తనకు సెంటిమెంట్ అని.. ముఖ్యమైన ఏ కార్యక్రమమైనా ఇక్కడి నుండే ప్రారంభిస్తానని తెలిపారు. కొండగట్టు ఆంజన్న గతంలో తనకు పునర్జన్మ ప్రసాదించారని పేర్కొన్నారు.
ఇక, పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో కొండగట్టు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇటు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై మూడు ఆప్షన్స్ చెప్పారు. ఆప్షన్ 1 గా.. ఇప్పటివరకు బీజేపీతోనే ఉన్నాం, ఉంటాం అని స్పష్టం చేశారు. అలాగే, ఆప్షన్ 2 లో బీజేపీ తమను కాదంటే ఒంటరిగా వెళ్తామన్నారు. ఆప్షన్ 3లో అదేదీ కుదరకపోతే కొత్త పొత్తులకూ సిద్ధం అని ప్రకటించారు.
ఈ మూడు ఆప్షన్స్ పై క్లారిటీ ఎన్నికలకు వారం ముందు తేలుతుందన్నారు పవన్. ఏ పార్టీతో పొత్తు ఉంటుంది.. ఏ పార్టీతో కలిసి వెళ్లాలి అనేది ఎన్నికలకు వారం రోజుల ముందు స్పష్టత ఇస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతోందని విమర్శించారు. లోకేష్ పర్యటన, తన పర్యటనను అడ్డుకుంటే వారికి నమ్మకం లేనట్లేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు కొండగట్టు టూర్ లో భాగంగా తెలంగాణ జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలన్న యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీ తనకు ఎప్పుడూ దోస్తేనని.. ఏపీతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని అభిప్రాయపడ్డారు. ఏపీలో తన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి రాజకీయ కారణాలతోనే అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు పవన్.