పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిన నాటి నుంచి ఆయన చేసే సినిమాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో కొన్ని నిజం అయినప్పటికీ మరికొన్ని వాటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే పవన్ పాలిటిక్స్ లోకి ప్రవేశించాక ఇక పవర్ స్టార్ సినిమాలు చేసేది అనుమానమే అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆయన మరోసారి మొహానికి రంగేసుకునేందుకు సిద్దమవ్వడంతో అవన్నీ కల్పిత వార్తలేనని తేలింది.
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. పింక్ రీమేక్ లో పవన్ నటిస్తారని ఆ మధ్య వార్తలు వచ్చిన అవన్నీ ఊహాగానాలేనని.. అధికారిక ప్రకటన వెలువడే వరకు పవన్ ఫ్యాన్స్ నమ్మలేదు. ఇక అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాక పవన్ సినిమాలో నటిస్తారనేది రూమర్ కాదు నిజమంటూ ఆనందం వ్యక్తం చేశారు. పింక్ రీమేక్ లో పవన్ నటిస్తారనే తెలియగానే మరికొంతమంది దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ సమయంలోనే క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు పవన్ అంగీకరించారని, అలాగే తనకు గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో జత కట్టేందుకు పవర్ స్టార్ రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. నిజంగానే ఆ ఇద్దరి దర్శకులతో పవన్ సినిమా చేయనున్నారని అధికారిక ప్రకటన వెలువడడంతో…మూడు సినిమాలతో పవన్ హంగామా చేయనున్నారని ఆయన అభిమానులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.
ఈ ఇద్దరి తరువాత పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లతో పవన్ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందొ చూడాలి. ఇదిలా ఉండగానే మరో రూమర్ పుట్టుకొచ్చింది. తొలి ప్రేమ సినిమాతో పవన్ కు మంచి హిట్ ఇచ్చిన కరుణాకరన్ తో పవర్ స్టార్ సెట్స్ పైకి వెళతారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్ని మాస్ చిత్రాల్లో నటించినప్పటికీ 1998లో విడుదలైన తొలిప్రేమ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. దీంతో పవన్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇటీవల కరుణాకరన్ పవన్ ను కలిస్ తొలి ప్రేమ సీక్వెల్ కు కథ వినిపించినట్లు సమాచారం.ఇక కథ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్టోరీ రెడీ చేయమన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.