జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో తన ఎన్నికల ప్రచార రథం వారాహి కి ప్రత్యేక పూజలు జరిపించారు. ముందుగా ఆలయ అధికారులు పవన్ కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి కి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాహనానికి ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు పవన్. ఆ తర్వాత వారాహి వాహనం ఎక్కి పరిశీలించారు.
మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కొండగట్టుకు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు పవన్. కొండగట్టులో అభిమానులు ఆయనకు నీరాజనం పట్టారు. కాన్వాయ్ ని అనుసరిస్తూ పరుగులు తీశారు. దారి పొడవునా పవను ను చూసేందుకు జనం చాలాసేపు బారులు తీరారు. పవన్ కాన్వాయ్ ఒక్కసారిగా రావడంతో ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ మురిసిపోయారు.
గజమాలలతో సత్కారం చేసిన అభిమానులు.. పూలు జల్లి పవన్ కు స్వాగతం పలికారు. అయితే.. ట్రాఫిక్ జామ్ కారణంగా అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యంగా కొండగట్టుకు చేరుకున్నారు పవన్. త్వరలో ఏపీవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. అలాగే తెలంగాణలోనూ కొన్ని స్థానాల్లో పోటీకి వ్యూహాలు రచిస్తున్నారు జనసేనాని.