ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు ఓసారి చూద్దాం. సెట్స్ పై హరిహర వీరమల్లు సినిమా ఉంది. లిస్ట్ లో హరీష్ శంకర్ చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఉంది. ఆ తర్వాత ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మధ్యలో వినోదాయ శిత్తం రీమేక్ కూడా చేయాలి. ఇవి కాకుండా, ఇంకో ప్రాజెక్టు కూడా వచ్చి చేరేలా ఉంది.
ఇప్పుడీ సినిమాలన్నింటినీ పవన్ కల్యాణ్ అటుఇటుగా ఏడాది వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంది. అంటే.. 2024లో ఎన్నికలున్నాయి. అంటే కనీసం 2023 ఏప్రిల్ నాటికి తన కమిట్ మెంట్స్ అన్నీ పూర్తిచేయాలి పవన్. అంటే.. ఆయనకు ఉన్నది కేవలం ఏడాది సమయం మాత్రమే. ఈ ఏడాదిలో ఆయన 3 సినిమాలు పూర్తిచేస్తారా అనేది అనుమానం.
హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. రాబోయే 3 నెలల్లో ఆ సినిమా పూర్తవుతుందని చెబుతున్నారు. ఇక హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల్ని ఎంత ఫాస్ట్ గా చేసినా ఏడాది అవుతుంది. అలాంటప్పుడు వినోదాయ శితం పరిస్థితేంటి? ప్రాక్టికల్ గా చూస్తే.. ఏడాదిలో పవన్ కల్యాణ్ 3 సినిమాలు పూర్తిచేయడం అసాధ్యమనే చెప్పాలి.
మరి పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు? వచ్చే సమ్మర్ లోపు చేయాల్సిన సినిమాలు చేసి, మిగతావి పక్కన పెడతాడా? లేక ఎన్నికల కోసం కేటాయించిన సమయాన్ని తగ్గించుకొని, సినిమాల కోసం వెచ్చిస్తాడా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతానికైతే ఇటు రాజకీయ కార్యక్రమాలు, అటు సినిమా కాల్షీట్లతో పవన్ 2 పడవల ప్రయాణం చేస్తున్నాడు.