పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే హరి హర వీర మల్లు అనే పీరియాడిక్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. తదుపరి ఏ సినిమాలు చేస్తారని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ … భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేయటానికి వెయిటింగ్‌లో ఉన్నారు.
కాగా.. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించిన డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే.. పవన్ బ్యాక్ సైడ్ నుంచి ఫొటో కనిపిస్తుంది. ఆయన ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు. పోస్టర్ అంతా ఎర్రగా కనిపిస్తుంది. అగ్ని తుపాను రానుందని, వాళ్లందరూ అతన్ని ఓజీ అని పిలుస్తారు అని కూడా పోస్టర్‌లో ఉంది. అదేంటో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమాకు రవి. కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించబోతున్నారు. హీరోయిన్ సహా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారనే వార్తలు కూడా నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో ఇదే కాంబినేషన్‌లో తమిళ చిత్రం తెర రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.
అయితే అవన్నీ అవాస్తవాలేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. రీమేక్ సినిమా కాకుండా ఫ్రెష్ సబ్జెక్ట్‌తోనే పవన్ సినిమా చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా సంగతేంటనే సందేహం రాక మానదు. అయితే ఆ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని సినీ సర్కిల్స్ టాక్.
వకీల్ సాబ్‌తో సైలెంట్‌గా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు సినిమాలను స్టార్ట్ చేశారు. అందులో ముందుగా భీమ్లా నాయక్ ఎప్పుడో విడుదలైంది. ఇప్పుడు హరి హర వీర మల్లు సినిమాను పూర్తి చేసే పనిలో టీమ్ ఉంది. ఇది పీరియాడిక్ మూవీ. దీని తర్వాత సుజిత్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారు పవన్ కళ్యాణ్.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022