తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్:
బీజేపీతో జతకట్టిన జనసేన ఆత్మరక్షణలో పడిందా…? అమరావతిపై జనసేన పోరుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సహకరించటం లేదా…? అమిత్ షా తెలంగాణ టూర్‌కు జనసేనాని డుమ్మా కొట్టబోతున్నారా…?
అమరావతి ఉద్యమం తర్వాత బీజేపీతో జనసేన పొత్తు ఏపీ రాజకీయా వర్గాల్లో సర్జికల్ స్ట్రైక్ అని అంతా భావించారు. పవన్ ఉన్నట్లుండి బీజేపీతో చేతులు కలపటం వైసీపీని కూడా కలవరపాటుకు గురిచేసింది. దీంతో మూడు రాజధానుల అంశం అటకెక్కినట్లేనని, రెండు పార్టీలు కలిపి అమరావతి ఉద్యమాన్ని లీడ్ చేస్తాయని అంతా భావించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా అలాంటి ప్రకటనలే చేసింది.
కానీ అనూహ్యంగా… బీజేపీ కేంద్రనాయకత్వం పవన్‌తో కాస్త దూరం మెయింటెన్ చేస్తున్నట్లు కనపడుతోంది. దీంతో బీజేపీ తీరుపై పవన్ అసంతృప్తిగా ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సీఏఏ సహా బీజేపీ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా, తాము అండగా ఉంటామని బహిరంగ ప్రకటనలు చేస్తుంటే… జనసేనను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని జనసైనికులు గుర్రుగా ఉన్నారు.
మరోవైపు మార్చి 15న హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఏఏ అనుకూల సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హజరుకావాలని పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వనం పంపినట్లు తెలుస్తోంది. కానీ బీజేపీ నేతల చేతల తర్వాత పవన్ ఆ సభకు దూరంగా ఉండబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తద్వారా తమ నిరసనను తెలియజేసినట్లు అవుతుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.