హమ్మయ్య.. ఎట్టకేలకు భయ్యా దారిలోకి వచ్చారు. తెలుసుకున్నారో.. మేలుకున్నారో గాని.. కాస్త క్లారిటీతో వచ్చారు. ఇప్పటివరకు ఏం చెబుతున్నారో.. అర్ధం కాక జనం తికమకపడ్డారు. మొత్తం మీద ఇదే స్టాండ్ మీద కాస్త నిలబడితే.. భయ్యాకు కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఆ కమలం పులిహారలో కలిశారంటే మాత్రం మళ్లీ ఇంకో టర్నింగ్ తప్పదు భయ్యాకు. అవును. పవన్ కల్యాణ్ క్లియర్ గా క్లారిటీగా అమరావతి రాజధాని గురించి ప్రకటించారు. ఇంతకు ముందు చెప్పలేదా అని జనసైనికులు ఆగ్రహించవచ్చు.. అయినా సరే.. మనకైతే ఇప్పుడే క్లారిటీ వచ్చింది. అంతకు ముందంతా రైతులకు అన్యాయం జరగకూడదు.. వారికి న్యాయం కోసం పోరాడతాం అన్నారే గాని.. అమరావతిలో రాజధాని కట్టాలో లేదో చెప్పలేదు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వెళ్లాలో వద్దో చెప్పలేదు. మూడు రాజధానుల కాన్సెప్ట్ మాత్రం అర్ధం లేనిదని మాత్రం చెప్పారు.
ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పుణ్యమా అని.. బాస్ తన పార్టీ నాయకులతో చర్చించి.. తమ జనసేన పార్టీ తరపున కూడా ఓ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కీలకమైన నిర్ణయం ఏంటంటే.. ‘‘అమరావతిలో పర్యావరణ హిత రాజధానిని నిర్మించాలి’’ అనే డిమాండ్ ను తెరపైకి తేవడం. అంటే పర్యావరణాన్ని పాడు చేయకుండా.. రాజధానిని ఇక్కడే అమరావతిలోనే నిర్మించాలనే క్లారిటీకి పవన్ కల్యాణ్ వచ్చేశారు. వేల ఎకరాలు ఇచ్చిన వేలాది రైతులకు అన్యాయం జరగకూడదని.. వారంతా భూములిచ్చారు.. తర్వాత కొన్ని బిల్డింగులు కట్టారు.. ఇంకొన్ని సగంలో ఉన్నాయి.. పబ్లిక్ ఫండ్స్ వేల కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్రం 2500 కోట్లు ఇస్తే, రాష్ట్రం మరో 6500 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు పెట్టాక.. ఇక్కడ ఏమీ లేకుండా చేయడం.. ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు పవన్ కల్యాణ్.
అంటే.. అమరావతిలోనే రాజధాని ఉండాలి.. అయితే అది పర్యావరణ హిత రాజధానిగా నిర్మించాలి. ఇదీ పవన్ కల్యాణ్ గారి డిమాండ్.. ఇదే విషయాన్ని జనసేన అధికారికంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతుంది. మరి ఇది బిజెపితో చర్చించి తీసుకున్న నిర్ణయమా.. చెప్పకుండా తీసుకున్న నిర్ణయమా.. లేక బిజెపితో చర్చించిన తర్వాత వారి అభిప్రాయాన్ని కూడా కాదని తీసుకున్న నిర్ణయమా అనేది.. బిజెపి హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకుంటే..వారేం వేస్తారో తెలిస్తే.. మనకు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుస్తుంది.