లేని సమస్యను సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని.. పరిష్కారం పేరుతో మళ్లీ అనేక ఇబ్బందులు పెడతారని మండిపడ్డారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నర్సాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
మత్స్యకారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో 217ని తీసుకొచ్చిందని.. దాన్ని వెనక్కి తీసుకునేదాకా జనసేన పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. సభపైనే జీవో 217 ప్రతులను చింపేశారు. వైసీపీ పిచ్చి వేషాలకు జనసేన భయపడదన్న పవన్.. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడతామన్నారు. జీవో చింపినందుకు తనను జైలుకు పంపించినా సిద్ధమేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 32 మత్స్యకార కులాలు, ఉపకులాలు ఉన్నాయన్న పవన్.. 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని చెప్పారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని వ్యాఖ్యానించారు. జీవో 217తో లక్షలమంది పొట్టకొడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆన్‌లైన్ విధానం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయొద్దని చెప్పారు పవన్. జనసేన ప్రభుత్వం వచ్చిన వారంలోనే జీవో 217 ఉపసంహరణ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మత్య్యకారులు ఇచ్చే స్ఫూర్తితోనే తాను పోరాటం చేస్తున్నానని.. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో మళ్లీ మాట్లాడతానని ఆరోజు భవిష్యత్ కార్యాచరణపై మరిన్ని విషయాలను ప్రకటిస్తానని వివరించారు పవన్. ఇటు ఏపీలో రోడ్లన్నీ అస్తవ్యస్థంగా మారిపోయాయని.. తాను సభకు వచ్చే దారి పోడవునా గోతులే కనిపించాయని ఎద్దేవ చేశారు.