సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న వేళ.. రాష్ట్రంలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్ కోతలు జగన్ సర్కారుకు పెద్ద తలనొప్పిలా మారాయి. అటు ఊళ్లల్లో జనం ఎక్కడికక్కడే ఆందోళనలు చేస్తున్నారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతోంది. తాజాగా జన సేనాని జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇది ప్రజలకు మీరిస్తున్న దసరా కానుకా… అని ప్రశ్నించారు.

‘ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగినట్టుగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది’ అని పవన్ ప్రశ్నించారు.
సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారని పవన్ ఆరోపణ. ఏపీ జెన్‌కో, థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప.. విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్లని, ఈ నెల 29వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55.315 మిలియన్ యూనిట్లు మాత్రమేనని పవన్ లెక్కలతో సహా వివరించారు.
‘ఏ కొత్త ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారు..కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడుల మీద ఒప్పందాలు చేస్తారు.. కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేస్తోందంటే.. ఇళ్ల కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాల రద్దు, భవననిర్మాణ కార్మికులకు పని లేకుండా చేయడం, ఆశ వర్కర్లని రోడ్లు మీదకి తీసుకురావటం, కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం…మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది’ అని పవన్ అన్నారు.