నాగార్జున యాదవ్ యనమల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2017 జనవరి 3వ తేదీ.. మంగళవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మణికంఠ సినిమా హాల్‌లో కోలాహలం.. పవన్‌కల్యాణ్ మాట్లాడుతున్నాడు.
‘మా పిన్ని భర్త కిడ్నీవ్యాధితోనే మరణించాడు.. విధవరాలైన మా పిన్నిని చూసి నేను పడిన బాధ అంత ఇంత కాదు.. ఉద్ధానం ప్రాంతంలో ఏ ఆడకూతురుని చూసినా నాకు నా పిన్ని గుర్తుకువస్తుంది’ అంటూ నవరస కళాపోషకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆనాడు అద్భుతంగా ప్రసంగించాడు. రాష్ట్రంలో ఆరోగ్యానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు. అందులో రూ.100 కోట్లు కేటాయించి ఉద్ధానం కిడ్నీ సమస్యను పరిష్కరించాలేరా? అంటూ ప్రభుత్వానికి నిలదీశాడు. ఇంతటితో ఆగలేదు.. 48 గంటల్లో పరిష్కారం చూపించండి. సరైన స్పందన రాకపోతే ఉద్యమం చేస్తా… అంటూ ఉద్ధానం ప్రాంత సమస్యపై ఉద్యమ ధ్వని వినిపించారు పవన్.!
48 గంటలు దాటిన తదనంతరం.. అంటే 2017 జనవరి 6వ తేదీనాడు శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంలో ఉన్న మేధావులను ఉద్ధానం వీధుల్లోకి తీసుకొస్తా.. కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో మూలాలు కనుక్కుంటా.. 106 గ్రామాల్లో రక్షిత మంచి నీటి సౌకర్యాన్ని కల్పిస్తా..రూ.2500 పెన్షన్ ఇస్తా.. కిడ్నీ వ్యాధిని తరిమికొడతా.. అంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
2017 జనవరి 16వ తేదీన డాక్టర్ టి.రవిరాజు చైర్మన్‌గా ఒక కమిటీ ఏర్పాటు చేసి కిడ్నీ సమస్యపై సమగ్ర అధ్యయనం చేయమని ఉత్తర్వులు జారీఆయ్యాయి. పవన్ కల్యాణ్ వల్లే సమస్య పరిష్కారం అయ్యిందని, ఇది జనసేన విజయం అని అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వార్తలొచ్చాయి. పెద్దపెద్ద వాళ్లు వ్యాసాలు రాశారు.
2017 జూలై 31వ తేదీ రాజధాని అమరావతిలో సచివాలయం దగ్గర… సందడిగా నెలకొని వుంది. ఉద్యోగులు, అధికారులు, అభిమానులు, మంత్రులు, ఎమ్యెల్యేలు చివరాఖరికి సీఎం చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ రాక కోసం వేచివున్నారు. ఆయన రానే వచ్చారు. ఉద్ధానం విషయంలో చంద్రబాబు చేసిన కృషికి పవన్ అభినందన మందార మాల తెచ్చి మెడలో వేశారు. పవన్ సూచనల మేరకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. చంద్రబాబు పద్దతి చూసి మెచ్చిన పవన్ జీవన్‌ధార్ అనే పథకానికి బ్రాండ్ అంబాసిడార్‌గా ఉంటానని ప్రకటించాడు…! ఈసారి వార్త చంద్రబాబు వంతు.. ‘కలసి ముందుకు సాగుదాం.. ఉద్ధానం కోసం ఎంతైనా ఖర్చు చేస్తా.. పవన్ ఉక్కు సంకల్పం.. ప్రభుత్వ సహకారంతో ఉద్ధానం ఊరడిల్లింది.. అంటూ బాగా అమ్ముడుబోయే పత్రికల్లో ప్రధాన శీర్షికలతో వార్తలు వచ్చాయి.
2017 సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం నాడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జియోలజికల్ సర్వే అఫ్ ఇండియా వారు ఉద్ధానం ప్రాంతంలో చేసిన పరిశోధనలపై నివేదిక ఇచ్చారు. భూగర్భంలో 118 రకాల మూలికలు ఉంటాయి. వాటిలో 14 రకాలు మూలికలు మోతాదు కంటే ఎక్కువ ఉంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉద్దానం ప్రాంతంలో సేకరించిన 12 రకాల శాంపిల్స్‌లో మోతాదు మించిన మూలికలు ఎక్కువ ఉన్నాయ్. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అనేది ఆనాటి మీటింగ్ సారాంశం…!
పవన్ సంకల్పంతో, చంద్రబాబు సహకారంతో, ప్రభుత్వం గుర్తించిన ఉద్దాన కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 265 మంది మాత్రమే. ఒక్క ఉద్దానం ప్రాంతమే కాదు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి బాదితులు సంఖ్య ఇది. రాష్ట్రవ్యాప్తంగా కిడ్నీవ్యాధి ఉన్నా రోగులు కేవలం 1,575 మంది మాత్రమే అంటూ.. వారికీ మాత్రమే రూ.2500/- పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రూ.39 లక్షలు విడుదల చేసింది. అధికారిక లెక్కల ప్రకారమే అక్కడి బాదితులు చికిత్స కోసం రోజువారీ వాడాల్సిన 24 రకాల మందుల ఖర్చే రూ.32 కోట్లు.
ఉద్దానం ప్రాంతంలోని కవటి, కంచాలి మండలాల్లో పెద్ద శ్రీరామపురం, కత్తివరం, హరిపురం, మకరాపురం, సాలినపుట్టగ, పెద్దపుట్టుగ, నర్తుపుట్టుగ, యలమంచిపుట్టుగ తదితర గ్రామాల్లో కనీసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేక పోయింది. పైగా రవాణాశాఖా మంత్రి అచ్చెంనాయడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ గ్రామాల ప్రజలు డయలసిస్ యూనిట్ ఉన్న సోంపేటకు వెళ్లి నెలకు మూడుసార్లు చికిత్స చేసుకోవాలంటే ప్రతి ప్రయాణానికి రూ.3వేలు ఆటోలకు లేదా ప్రైవేటు బస్సులకు చెల్లించుకోవాలి. కానీ ప్రభుత్వం ఇచ్చేది మాత్రం రూ.2500/-
పవన్ సంకల్పం, ప్రభుత్వ సహకారం, ప్రచారం ఘనం అనే అంకానికి తెరపడింది. ఉద్దానం సమస్య మూలన పడింది.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాదించిన తర్వాత డయాలసిస్ చేపించుకునే కిడ్నీ బాదితులైన 8,000 మందిని గుర్తించి వారికి నెల నెలా రూ.10వేల పెన్షన్ ప్రకటించారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి శాశ్వత పరిష్కారం చూపేలా రేగులపాడు వద్ద మంచి నీటి జలాశయాన్ని రూ.600 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. దీనికి శంకుస్థాపన చేయడానికి కూడా రంగం సిద్దమయ్యింది. తద్వారా కిడ్నీ ప్రభావిత బాధిత గ్రామాలైన 135 గ్రామాలకు సమగ్ర మంచినీటి సౌకర్యం కలుగుతుంది. పలాసలో కిడ్నీ పరిశోదన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమే కాకుండా షిఫ్ట్‌కు 100 మందికి పైగా సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది.
ఉద్దానం సమస్య పరిష్కారం కోసం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 100 రోజులలోపే రిజర్వాయర్, రిసెర్చ్ సెంటెర్, హాస్పిటల్ లాంటి పరిష్కార మార్గాలు పట్టలెక్కుతుంటే.. ఉద్దానం సమస్యను నేనే ఉద్దరించా అని చెప్పుకునే పవన్ కల్యాణ్ కనీసం స్పందించకపోవడం ప్రస్తావనార్హం.
రూ.100 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని పవన్ ప్రకటిస్తే.. కనీసం రూ.10 కోట్లు కూడా చంద్రబాబు కేటాయించలేదు కానీ, సీఎం వైఎస్ జగన్ ఏకంగా 1000 కోట్ల మహా ప్రణాళికకు సెప్టెంబర్ 6వ తేదీన శంకుస్థాపన చేస్తున్నారు.
గత ప్రభుత్వ సమయంలో నేను కొట్టినట్టు నటిస్తా నువ్వు ఏడ్చినట్టు నటించు అనే సన్నివేశం పేరుతొ పవన్-బాబు వేసిన నాటకాన్ని ప్రజలు గ్రహించి సరైన తీర్పు ఇచ్చాక కూడా పవన్ తీరు మారకపోవడం దేనికి సంకేతం..!
ఉద్ధానం ప్రాంతంలో పర్యటించి బాబాయ్-పిన్ని అంటూ చెప్పిన సెంటిమెంట్ నిజమైతే ఇలాంటి మహత్తర నిర్ణయాన్ని పవన్ ఎందుకు ఆహ్వానించలేదు ? ఒక సాధారణ డయలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తా అని చంద్రబాబు ఇచ్చిన హమికే శాలువాలు, బొకేలతో సన్మానం చేసిన పవన్ ఇప్పుడు వైఎస్ జగన్ తీసుకున్నా శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలి?
ఎన్నికల ముందు వచ్చి డైలాగులు చెప్పే నటులను చూసి ప్రజలు ఈలలు వేయచ్చు, కేరింతలు కొట్టచ్చు, కరతాళ ధ్వనులు చేయచ్చు కానీ ఓటు మాత్రం విలువలు, విశ్వసనీయత, విజన్ ఉన్న నాయకుడికే వేస్తారనేది మరోసారి నిరూపించడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం భవిష్యత్తులో వేదిక కానుంది.
ఉద్దానం ప్రాంతంపై సీఎం జగన్ స్పూర్తికి తోడుగా శ్రీకాకుళం దైవం అరసవెల్లి సూర్యనారాయణుడి సూర్య కిరణాల స్పర్శ ఉండాలని, కూర్మ రూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు నెలకొన్న శ్రీకూర్మం చూపు ఉద్దాన ప్రాంతంపై పడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వంశధార, నాగావళి ప్రవాహ హొయలు జోడవ్వాలని, వ్యవహరిక భాషోద్యమానికి ఊపిరులూదిన ఉద్దాన ప్రాంత నివాసి గిడుగు రామ్మూర్తి గారి సేవలకు చిహ్నంగా ఉద్దానం ప్రాంతనికి ఉజ్వల ప్రస్థానం ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.