సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనదైన స్టయిల్ లో ట్విట్టర్ లో కొన్ని పోస్టులు పెడుతుంటారు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలు, ప్రపంచ, సామాజిక జ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలపై ఆయనకు గట్టి పట్టుంది.
తాజాగా.. పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉన్న ఓ కొటేషన్ ను ఆయన పోస్ట్ చేశారు.
‘శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగినంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే’ అనే కొటేషన్ ను ట్వీట్ చేశారు.
బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన అవశ్యకతపై రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా రచయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని వివరించారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. నిజమైన సోషలిస్ట్ పవన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.