తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్ఫూర్తిని జనసేన శ్రేణులు కనబరచాలని అన్నారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, శ్రేణులు ఎంతో ప్రభావశీలంగా పని చేశారు. ఫలితాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. పార్టీ భావజాలంతో పోటీలో నిలిచి, పార్టీ శ్రేణుల మద్దతు పొందినవారు 18 శాతానికి పైగా ఓట్లు, గణనీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కైవశం చేసుకొన్నారని పవన్ అన్నారు.
నాకు అందిన సమాచారం మేరకు విశ్లేషిస్తే 17 వందలకు పైగా పంచాయతీల్లో రెండో స్థానం దక్కిందని… ఈ ఫలితాలు చూస్తుంటే మార్పు మొదలైందని అర్థం అవుతోందన్నారు. ఇది కచ్చితంగా మార్పుకు సంకేతమని తెలిపారు. సామాన్యంగా పంచాయతీ ఎన్నికలు అంటే అధికార పక్షానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారు. వారందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే మూడు దశల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆశిస్తున్నాను అంటూ పవన్ చెప్పుకొచ్చారు.