ఏపీలోని అచ్యుతాపురం సెజ్ లోని దుస్తులు తయారు చేసే సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికారగణం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఇదే కంపెనీలో నెలక్రితమే ఇటువంటి ప్రమాదం జరిగి 400 మంది అస్వస్థతకు గురయ్యారని.. మళ్లీ అదే ఘటన పునరావృతమైందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో అటు అధికారులుగానీ.. ఇటు కంపెనీ ప్రతినిధులుగానీ చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని.. ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో.. ఎంతమంది ప్రాణాలను హరించిందో.. ఎప్పటికీ మరచిపోలేమన్నారు.కాబట్టి.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో పక్కా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించాలని సూచించారు జనసేనాని.
“రాష్ట్ర, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరం. అయితే.. ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలి. ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పని చేయాలి. ప్రమాదంలో అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మేలైన వైద్యాన్ని, నష్ట పరిహారాన్ని అందించాలి” అంటూ కోరారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలను అరికట్టలేరా ? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/qfn0nwmWuZ
— JanaSena Party (@JanaSenaParty) August 4, 2022
Advertisements