తిరుపతిలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. భాకరాపేట లోయలో జరిగిన బస్సు ప్రమాదం శోచనీయమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.\
నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ అమాయకుల ప్రాణాలను హరిస్తున్న ట్రావెల్ యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టాలన్నారు. ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపర్చాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు పవన్ కళ్యాణ్.
అయితే.. ధర్మవరం నుంచి తిరుపతి వెళ్తున్న పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా.. సుమారు 300 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.