పవన్ సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిస్థాయిలో పాలిటిక్స్ పైనే దృష్టి సారించారు. అయితే ఆయన అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన పవన్ సన్నిహితులు మళ్ళీ సినిమాలో నటించాలని ఒత్తిడి చేశారు. దీంతో బాలీవుడ్ లో అదరగొట్టిన పింక్ స్టోరీని పవన్ కు వివరించడంతో ఆయన సినిమా చేసేందుకు ఒకే అన్నారు. ఆయన మళ్ళీ మొహానికి రంగేసుకోనున్నట్లు నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు పవన్ తాను సినిమాలో చేస్తున్నానని ధ్రువీకరించలేదు.
ఈనెల 20న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను వచ్చే నెల మొదటి వారంలో షూట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పవన్ కేవలం 20కాల్షీట్లు మాత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం చిత్రీకరణ కోర్టు హల్లోనే ఉంటుంది కనుక అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే… ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి చిత్రీకరణ ప్రారంభంకాకపోయినా సినిమా విడుదల డేట్ ను కన్ఫార్మ్ చేశారని తెలుస్తోంది. మే 23న ఈ సినిమాను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలనీ దర్శక నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. పవన్ అజ్ఞాతవాసి నిరాశ పర్చడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాను దర్శకుడు స్టోరీని తీర్చిదిద్దుతున్నారు.
దిల్ రాజు.. బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.