– వచ్చే ఎన్నికల బరిలో జనసేన
– 30 స్థానాల్లో పోటీకి సై అన్న పవన్
– ఏపీలో బీజేపీతో సత్సంబంధాలు
– తెలంగాణలో పోటీ దేనికి సంకేతం?
పవన్ సారథ్యంలోని జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీ చేసింది లేదు. ఏపీలో గత ఎలక్షన్ లో బరిలోకి దిగినా దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ.. పవన్ మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన పవన్.. చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.
ముందుగా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని కలిశారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సేనాని.. సైదులు భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అక్కడి నుంచి కోదాడ వెళ్లారు. అక్కడ కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 లక్షల బీమా చెక్కును ఇచ్చారు. లక్కారంలో మీడియాతో మాట్లాడిన పవన్.. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామని.. 30 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 5 వేలకుపైగా తమకు ఓట్లున్నాయని తెలిపారు. తెలంగాణలోనూ రాజకీయాలను జనసేన శాసిస్తుందని చెప్పారు. ఇక్కడ కూడా తమ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని వెల్లడించారు. తాను రాజకీయాల్లో ఎన్నో దెబ్బలు తిన్నానని.. అయినా ఓ ఆశయంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో సామాజిక మార్పు రావాలని.. అట్టడుగు స్థానంలో ఉన్నవారు పైకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జనసేన నాయకులు తిరిగి.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అయితే.. బీజేపీతో జనసేనకు సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో వేరుగా పోటీ చేస్తే మాత్రం ముందుగా నష్టపోయేది ఆ పార్టీనే అని అంటున్నారు విశ్లేషకులు. పవన్ చెప్పినట్లు 5 వేలకు పైగా ఓట్లు చీలిపోతే ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు కష్టమేనని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వైటీపీ, బీఎస్పీ వల్ల టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని.. ఇప్పుడు జనసేన ఎంట్రీతోనూ తీవ్ర ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.