విశాఖపట్నం : భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వానికి చాటి చెప్పే లక్ష్యంతో జనసేన తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’లో ఆ పార్టీ అధినేత పవన్ ప్రసంగించారు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కాదు… సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదని పవన్ వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలు సరదా కాదని…ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడినని.. సినిమాల్లోకి కూడా పొరపాటున వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. సగటు రాజకీయ నాయకుల పాలసీలు, విధివిధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచే నాయకులు పుడతారని.. అలాగే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు.
మంత్రి కన్నబాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న ఆయన…నాగబాబు తీసుకొస్తే కన్నబాబు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అలాంటి కన్నబాబు కూడా తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘వాళ్ల బతుకులు తమకు తెలియవా?’ అని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయానని బాధపడటం లేదన్నారు. తమపై ప్రేమ, అభిమానం, మద్దతు చూస్తే జనం కోసం నిలబడాలన్న కసి, పట్టుదల పెరుగుతున్నాయని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు లేకపోతే జీవిత రథచక్రాలు ఆగిపోతాయన్నారు. కార్మికులను కాపాడుకోలేకపోతే జీవితాలు ఆగుతాయని పేర్కొన్నారు. వైసీపీ నేతల ప్రచారాలను జనాలు నమ్మి తనను ఓడిపోయేలా చేశారని తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఇసుకను వైసీపీ నేతలు చులకన చేసి మాట్లాడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం మెడలు వంచి ఇసుకను తెస్తాం: అచ్చెన్నాయుడు
ఇంత శాడిస్ట్ ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి ఇసుకను అందుబాటులోకి తెస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో 150 సీట్లు గెలిపిస్తే… ఐదు నెలల్లో అందరికీ జగన్ అన్యాయం చేశాడన్నారు. ఐదు నెలలుగా ఇసుక సమస్యపై పోరాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
‘జగన్ బదులు పిచ్చోడిని సీఎం చేసినా బాగా పాలించేవాడు’
పిచ్చోడిని సీఎం చేసినా, జగన్ కంటే బాగా పాలన చేస్తాడని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఎవరి మాట వినకుండా జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేశారని ఆరోపించారు. ఇసుక బంగారం అయిపోయిందని, లారీ ఇసుక 50 వేల రూపాలయకు చేరిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జనసేన నిర్వహించిన ‘లాంగ్‌మార్చ్’ లో టీడీపీ తరపున పాల్గొన్నారు. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని మండిపడ్డారు. ఇసుక మీద లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఇసుక లేక నిర్మాణ రంగం కుదేలైపోయిందని తెలిపారు. ఐదు నెలలుగా కార్మికులకు తినడానికి తిండి లేదని, కార్మికుల ఆత్మహత్యలను దౌర్భాగ్య మంత్రులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని ఇసుక సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వర్షాకాలానికి ముందు ఇసుకను నిల్వ చేసుకోవాలన్న జ్ఞానం లేదా? అని మండిపడ్డారు. నిజాయితీలను గెలిపించుకోవాలని, దొంగలను గెలిపిస్తే ఇలాగే ఉంటుందని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.