వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేసుకోడానికే కోనసీమ గొడవ స్టార్ట్ చేశారని విమర్శించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ అల్లర్లకు టీడీపీ, జనసేనే కారణమంటూ హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టుకుని ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు.
కుల సమీకరణం మీదే రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయన్న పవన్.. వైసీపీ కులాల మీదే ఆటలాడుతోందని మండిపడ్డారు. కోనసీమలో గొడవలు జరిగే వాతావరణం సృష్టించింది వైసీపీనే అని విమర్శించారు. రాష్ట్రానికి తొలి దళిత సీఎం అయిన దామోదరం సంజీవయ్య పేరు కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది కర్నూలుకు సంజీవయ్య పేరు వద్దన్నారని గుర్తు చేశారు. సంజీవయ్య అంటే గౌరవం లేక కాదని.. కర్నూలు.. కర్నూలుగానే ఉండాలనుకున్నారని చెప్పారు.
అంబేద్కర్ ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఏ ప్రభుత్వం కూడా అనుకోవడం లేదన్నారు. వైసీపీకి అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే.. ఆయన కోరుకున్న ఎస్సీ సబ్ ప్లాన్ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు పవన్. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో రూ.10వేల కోట్లను ప్రబుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు.
అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని నిలదీశారు పవన్. కోనసీమ గొడవల వెనుక జనసేన, ఇతర పార్టీలు ఉన్నాయన్న హోంమంత్రి వ్యాఖ్యలకు తాము ఆశ్చర్యపోలేదన్నారు. తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే అత్యాచారాలు జరుగుతూ ఉంటాయన్న హోంమంత్రి అంతకంటే ఏం మాట్లాడతారని చురకలంటించారు. దేశంలో దళితులపై జరిగిన దాడుల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్రమంత్రి అథవాలే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కోనసీమ అల్లర్ల వెనుక డిజైన్ ఉందన్న పవన్.. కోడి కత్తి కేసు విచారణ ఎక్కడ ఉందో హోంమంత్రి చెప్పాలని నిలదీశారు. అలాగే వివేకానంద రెడ్డిది హత్యా? ఆత్మహత్యా? ఇంకా ఎందుకు తేలలేదని అడిగారు. మీ మీద మీరు దాడులు చేయించుకుని సింపతీ పెంచుకున్నారని విమర్శించారు. కోనసీమకు కొత్త విధానం ఎందుకని.. జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. గొడవలు పెట్టడానికే పేరుపై అభ్యంతరాలకు 30 రోజుల గడువు ఇచ్చారా? అని అనుమానం వ్యక్తం చేశారు.