సినీ ఇండస్ట్రీ జోలికొస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు హీరో పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారాయన. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్. తేజ్ ప్రమాదానికి గురైతే అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారని.. కానీ యాక్సిడెంట్ ఎలా అయింది..? హైస్పీడ్, నిర్లక్ష్యం అంటూ లేనిపోని కథనాలు రాయడం కరెక్ట్ కాదన్నారు.
సమాజంలో చాలా సమస్యలున్నాయని.. వాటిపై దృష్టి పెట్టాలని కోరారు పవన్. బాధ్యతాయుతమైన వార్తలు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని కేసులను ప్రస్తావించారు పవన్. వైఎస్ వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు..? కోడికత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనక కథేంటి..? పోడు రైతుల సమస్యలేంటి..? ఆరేళ్ల చిన్నారిపై ఘోరం జరిగితే.. దానికి గల కారణాలేంటి..? ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై వార్తలు రాయాలన్నారు. మీడియాకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలని సవాల్ చేశారు పవన్.
సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవన్న ఆయన… ఇండస్ట్రీ జోలికొస్తే అందరం కలిసి పోరాడతామని చెప్పారు. సినిమా వాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదని.. సినిమా పెద్దలు బలంగా నిలబడాలి భయపడొద్దని చెప్పారు. ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని తెలిపారు. మంత్రి పేర్ని నాని చేసిన సోదరభావన కామెంట్స్ పై కూడా స్పందించారు పవన్. ఈ సందర్భంగా కాస్త ఘాటైన విమర్శలే చేశారు. ఏపీలో సినిమాలు ఆపేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీని హింసించొద్దని నటుడు మోహన్ బాబు తన బంధువులకు చెప్పాలన్నారు పవన్. కావాలంటే తనపై నిషేధం విధించుకోమని సూచించారు.
ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని.. చిత్ర పరిశ్రమ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు చూపించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు పవన్. ప్రెసిడెంట్ మెడల్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ కు వెళితే సరిపోతుందనే సెటైర్లు వేశారు. చిరంజీవి లాంటి వారు ప్రాధేయ పడొద్దన్న పవన్.. ఇది మన హక్కని గుర్తు చేశారు. ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావాలని.. వైసీపీ విధానాలపై గట్టిగా మాట్లాడాలని సూచించారు.