వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు అదే రీతిలో కౌంటర్ ఎటాక్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో మరణించిన కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని బాధిత కుటుంబాలు వారి బాధను తనకు చెప్తుంటే ఎంతో బాధేసిందన్నారు. మన్నీల గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు పవన్.
వైసీపీ నేతలు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని.. తనను ఎన్ని తిట్టినా భరిస్తానని చెప్పారు. తాను సీబీఎన్ కి దత్తపుత్రుడినే అయితే.. మీరు సీబీఐ దత్తపుత్రులా అని ప్రశ్నించారు. తాను మాట్లాడితే టీడీపీ బీ టీమ్ అయితే.. మీది చర్లపల్లి షటిల్ టీమా. అంటూ సెటైర్లు వేశారు. వైసీపీ నాయకులు స్వతంత్ర సమరయోధుల మాదిరిగా ఫీలవుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేదన్నారు పవన్. ప్రజలు కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. రైతులకు కులం ఉండదని.. అలాంటి వారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదన్నారు. తనకు భయం లేదని. దెబ్బ పడేకొద్దీ రాటుదేలతానని చెప్పారు.
ప్రభుత్వం చెవులు పిండించి మరీ కౌలు రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తామన్నారు పవన్. ప్రతి కుటుంబానికి డబ్బు, కౌలుదారు గుర్తింపు కార్డులు వచ్చే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. తమకు సాయం చేసిన పవన్ కు రుణపడి ఉంటామని బాధిత కుటుంబాలు తెలిపాయి. పవన్ వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, జిల్లా అధ్యక్షులు టీసీ వరణ్ సహా పలువురు ఉన్నారు.