ఏపీలో కుల సమీకరణాలతో రాజకీయాలు నడుస్తుంటాయి. అందుకే.. అక్కడి పాలిటిక్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. అయితే.. వేర్వేరు దారుల్లో వెళ్తున్న ఈ పార్టీలు ఒకే బాటలో నడిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉందని రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కీలక అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.
మరికాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఏపీ రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా వీరిద్దరు చర్చించనున్నారు. ప్రతిపక్ష పార్టీలపై ఆంక్షలపై బాబు, పవన్ మాట్లాడుకుంటారని అంటున్నారు. అయితే.. పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.
ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే.. వైసీపీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. 2014లో ఇది రిజువైంది. 2019 ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీకి దిగి రెండు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. అందుకే వచ్చే ఎన్నికలకు కలిస్తే జగన్ ను ఓడించడం ఈజీ అవుతుందని ఇరు పార్టీల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.
కొన్నాళ్ల క్రితం వైజాగ్ లోనూ వీళ్లిద్దరు కలిశారు. ఆ సమయంలో పవన్ పర్యటనపై ఆంక్షలు పెట్టడంపై చర్చించుకున్నామని.. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికలకు ఇరు పార్టీలు కలుస్తాయని వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, పవన్ కలుస్తుండడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.