గుంటూరు : రాజధాని నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని జన సేనాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పులివెందులలో రాజధాని పెట్టుకుంటాం, విజయనగరంలో రాజధాని పెట్టుకుంటాం అంటే కుదరదని జనసేనాని వ్యాఖ్యానించారు. జగన్ ఇదే ధోరణిలో ఉంటే కచ్చితంగా కేంద్ర పెద్దలను కలుస్తానని చెప్పారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్‌కల్యాణ్.. అక్కడ రైతులతో సమావేశమయ్యారు. ‘అమరావతిని రాజధానిగా కాదంటున్నారంటే.. మోదీని, అమిత్ షాను వ్యతిరేకిస్తున్నట్టే. బీజేపీ పెద్దలతో నాకు పరిచయాలు ఉన్నా.. ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా వాటిని వాడలేదు. రాజధానికి ఇబ్బంది కలుగుతుంటే మాత్రం మోదీని, అమిత్ షాను కలుస్తాను’ అని జనసేన అధ్యక్షుడు చెప్పారు.
రైతులు కౌలు కోసం భూములు ఇవ్వలేదు. రాజధాని కోసం త్యాగంచేశారని, రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోనని పవన్ కల్యాణ్ అన్నారు. ‘అమరావతి మన ఆత్మ గౌరవం. రైతులను ఇబ్బంది పెట్టే పని ఎవరు చేసినా రైతులకు మేం అండగా ఉంటాం. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది నా రాష్ట్రం, మీరు నా వాళ్లనే ఉద్దేశంతోనే పని చేస్తున్నాను’ అని అన్నారు. రైతులెవరూ భూములను అమ్ముకోవద్దని పవన్ సూచించారు. వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడాలని జనసేనాని వార్నింగిచ్చారు. కాలం ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని, అధికారం ఎప్పుడూ ఒకరికే ఉండదని అన్నారు.