ఏపీలో అన్నదాతల అవస్థలు అన్నీఇన్నీ కావని ప్రతిపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు బాసటగా నిలిచారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు.
ముందుగా అనంతపురం జిల్లా కొత్త చెరువు వెళ్లారు పవన్. అక్కడ సాగు నష్టం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. రామకృష్ణ చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని అతని భార్య సుజాత వాపోయింది. జనసేన తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు పవన్. అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కొత్త చెరువు నుంచి ధర్మవరం వెళ్లారు పవన్. అక్కడ శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కలిశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డాడు రాజశేఖర్ రెడ్డి. అతని మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు పవన్. జనసేన తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య చంద్రకళకు అందజేశారు. రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
గొట్లూరు, బత్తలపల్లి, పూలకుంట, మన్నీల గ్రామాల్లో పవన్ పర్యటన ఉంది. ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, జిల్లా అధ్యక్షులు టీసీ వరణ్ సహా పలువురు ఉన్నారు.