జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి ఏపీలోకి అడుగుపెట్టింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏపీలోకి ఎలా అడుగుపెడుతుందో చూస్తామని వైసీపీ నేతలు మాట్లాడారు. ఆ తర్వాత మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా? అని అంతా ఉత్కంఠగా చూశారు. కానీ, వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. పవన్ వాహనం తెలంగాణ గడ్డపై నుంచి ఏపీలోకి అడుగుపెట్టింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు పవన్. అంతకుముందు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో పవన్ కు స్వాగతం పలికారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వారాహి వాహనానికి కూడా పూజలు చేశారు.
కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజలు జరిపారు పవన్. పవన్ రాక నేపథ్యంలో జనసైనికులు భారీగా తరలివచ్చారు. పైన ఇంద్రకీలాద్రి, కొండ కింద కిక్కిరిసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్డులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూజల అనంతరం వారాహి వాహనంపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు పవన్. విజయవాడ వీధులు జై జనసేన నినాదాలతో మార్మోగాయి. భారీ ర్యాలీతో వారాహి వాహనంతో పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు జనసేనాని.