జనసేనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన.. తాము ప్రజా సమస్యలపైనే పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలు చేయడం తమకు అలవాటు లేదన్నారు. ప్రజల కోసం తాము ప్రశ్నిస్తుంటే.. వైసీపీ నేతలకు దుర్మార్గులం అయ్యామా? అంటూ మండిపడ్డారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని.. తాము కూడా అదే స్థాయిలో మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు పవన్. తాము పాలసీల గురించే మాట్లాడుతున్నామని.. వైసీపీ అగ్రనాయకత్వం ఇది తెలుసుకోవాలని చెప్పారు. కాస్త ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు.
వ్యక్తిగత అజెండా లేకుండా సాగుతున్న తమ సహనాన్ని పరీక్షించొద్దన్నారు పవన్. జనసేన మొదలుపెట్టినప్పటి నుంచి తనకు వ్యక్తిగత అజెండా లేదని స్పష్టం చేశారు. ప్రజలు బాగుండాలన్నదే తన ఆలోచన అని తెలిపారు.
మరోవైపు విద్యుత్ అంశంపైనా స్పందించారు పవన్. అధికారంలోకి రాకముందు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు పవన్. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపలేదా? అని మండిపడ్డారు. కుడి చేత్తో ఇచ్చి.. ఎడం చేత్తో వైసీపీ లాగేసుకుంటోందని అర్థమైందన్నారు. భవన నిర్మాణ కార్మికుల నుంచి మొదలుకొని కౌలు రైతుల వరకు తాము సమస్యల పరిష్కారానికే ప్రయత్నించామని తెలిపారు పవన్.
Advertisements