ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అయితే రానున్న ఎన్నికల దృష్ట్యా పవన్ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మండపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే శక్తి గోదావరి జిల్లా ప్రజలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో గోదావరి జిల్లాల ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని.. చెల్లించే పన్నులనే ప్రజలకు ప్రభుత్వం ఇస్తోందన్నారు.
జనసేన అధికారంలో ఉన్నా.. లేకపోయినా కౌలు రైతుల పక్షాన నిలబడి, సాయం చేస్తోందంటూ పవన్ వెల్లడించారు. కౌలు రైతుల కుటుంబాలకు ఇప్పటికే కోట్ల రూపాయల సాయం చేశామన్న ఆయన.. రైతులకు అండగా నిలిచేందుకు ఇదంతా చేస్తున్నామని స్పష్టం చేశారు. రూ. 7 లక్షల బీమా సొమ్ము కౌలు రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisements
అంబేద్కర్‌ను తాను స్పూర్తిగా తీసుకున్నానని.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సీఎం ఇష్టపడటం లేదని పవన్ ఆరోపించారు. మరోవైపు ఏపీ, తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నా తెలంగాణ అనే భావన ఉందని.. కులమనే భావన ఏపీలో ఉందన్నారు. కులాన్ని గౌరవిస్తూ , కులానికి అతీతంగా ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.