ఏలూరు జిల్లా ముసునూరులోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పలువురు నేతలు స్పందించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఫ్యాక్టరీ నుంచి రూ.25 లక్షల చొప్పున ఇప్పించడంతో పాటు.. ప్రభుత్వం నుండి మరో రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఇదే ఘటనపై తాజాగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామన్నారు. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్టు.. ఇప్పుడు పోరస్ ఫ్యాక్టరీ ఘటన మృతుల కుటుంబాలకు అదే రీతిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఒక్కో ప్రమాదానికీ ఒక్కో విధంగా పరిహారం ప్రకటించడం సరికాదన్నారు పవన్. ఈ ప్రమాదంలో గాయాలై ఆసుపత్రి పాలైన బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు.. న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరారు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో 13 మందిని విజయవాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.