– రాజులు మారితే రాజధానులు మారవు
– సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు
– మూడు రాజధానులు అని చెప్తున్న నేతలు..
– ఆనాడు గాడిదలు కాశారా?
– ఏపీకి అమరావతే రాజధాని
– రాసిపెట్టుకోండి.. 2024లో జనసేనదే గెలుపు
– వైసీపీది విధ్వంస పాలన
– పార్టీ ఆవిర్భావ సభలో పవన్
వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమన్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన జనసైనికులు, ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. జై ఆంధ్రా.. జై తెలంగాణ.. జై భారత్ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్.. సభకు హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. లోక కల్యాణం కోరే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత పెద్దలకు నిత్యం రామకోటి రాసే స్త్రీమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు.
సభ కోసం తమ పొలాలు ఇచ్చి సహకరించిన ఇప్పటం రైతులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్. ఈ సందర్భంగా గ్రామానికి తన ట్రస్ట్ తరఫున రూ.50 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే సభ నిర్వహణకు అనుమతి ఇచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీస్ అధికారులకు, సోదరులైన కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన ఎస్సైలకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సభలో ప్రసంగించారు పవన్.
తెలంగాణలో అలయ్-బలయ్ సంస్కృతి ఉందని.. తన సంస్కారం టీడీపీ, వైసీపీ నేతలు కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టమంటోందన్నారు. వైసీపీలో బూతులు తిట్టే నేతలే కాకుండా మంచి నేతలు కూడా ఉన్నారని చెప్పారు. ఒక పార్టీని నడపాలంటే డబ్బు కాదు సైద్ధాంతిక బలం ఉండాలని.. 7 శాతం ఓట్ల నుంచి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన ఎదిగిందని వివరించారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు.
కొందరు నేతలు తొడలు కొడుతున్నారని.. అలాంటి వారిని చూస్తే నవ్వొస్తుందని చెప్పారు పవన్. వైసీపీ నాయకత్వంతో, మంత్రులతో తనకేమీ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనతో మొదలు పెడుతుందని.. కానీ.. జగన్ సర్కార్ మాత్రం కూల్చివేతలతో ప్రారంభించిందని సెటైర్లు వేశారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డుపై పడేశారని.. ఇసుక పాలసీతో కార్మికుల జీవితాలు నాశనం అయ్యాయని మండిపడ్డారు. విధ్వంసపూరిత ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి.. రాష్ట్ర ప్రజలు నా బానిసలు అనేలా వైసీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ‘‘చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని దెబ్బకొడతాం.. ఇసుకను అప్పడంలా కరకర నమిలేస్తాం.. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెట్టేస్తాం.. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఆదాయం పెంచుకుంటాం.. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తాం.. ఇంకో ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం’’ అని వైసీపీ నేతలు ప్రతిజ్ఞ చేశారని సెటైర్లు వేశారు.
మూడు రాజధానులు అని చెప్తున్న నేతలు.. ఆనాడు గాడదలు కాశారా? అని మండిపడ్డారు. రాజధాని అమరావతికి ఇంకో వెయ్యి ఎకరాలు అదనంగా కావాలని జగన్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి ఇక్కడి నుంచి కదలదని.. న్యాయవ్యవస్థను కూడా తప్పుబట్టే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్లిందని విమర్శించారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని.. అసలు.. న్యాయవ్యవస్థను ప్రశ్నించే అర్హత వైసీపీ నేతలకు ఎక్కడుందని నిలదీశారు. కొందరు వైసీపీ నేతల వల్ల ముగ్గురు సీనియర్ అధికారులు కోర్టులో నిలబడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. వారి చేత రూల్ బుక్ తీయించి న్యాయస్థానం చదివించిందని తెలిపారు. వెల్లంపల్లి..వెల్లుల్లిపాయ గాళ్లకు, అవంతి, బంతి, చామంతికి ఐపీఎస్ అధికారికి ఉండే నాలెడ్జ్ ఉందా? అంటూ సెటైర్లు వేశారు. ఇందతా కర్మ కాకపోతే ఇంకేంటి? దేశం చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు.
అధికారమదంతో ఉన్న వైసీపీ మహిషం కొమ్ములు విరగ్గొట్టి.. కింద కూర్చోబెట్టి.. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఇదే జనసేన 9వ ఆవిర్భావ సభ లక్ష్యం, ఉద్దేశమని తెలిపారు. ఢిల్లీ బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామన్నారని.. దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. వైసీపీ నేతలను ఎప్పుడు గద్దె దించాలో బీజేపీ చెప్తే చేసి చూపిస్తామన్నారు. ఎమర్జెన్సీ టైమ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఎలా ఏకం అయ్యాయో… వైసీపీ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వకుండా చూస్తామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర బాధ్యతను తీసుకుంటున్నానన్న పవన్.. ‘‘వైసీపీది విధ్వంసం.. జనసేనది వికాసం.. వారిది ఆధిపత్యం.. మనది ఆత్మగౌరవం.. వారిది అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.