చాన్నాళ్ల తర్వాత సెట్స్ పైకొచ్చింది హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం పవన్ ఏకంగా 2 నెలలు కాల్షీట్లు కేటాయించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కేవలం వీరమల్లు మూవీ మాత్రమే కాదు, పవన్ అంగీకరించిన సినిమాలన్నీ ఇంకాస్త వెనక్కు వెళ్లబోతున్నాయి. దీనికి కారణం పవన్ పొలిటికల్ కార్యక్రమాలే.
ప్రస్తుతం కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, మృతిచెందిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వాళ్లకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ పర్యటనలకు అనూహ్య స్పందన వస్తోంది. దీంతో వీటిని ఇలానే ఇంకొన్నాళ్లు కొనసాగించాలని పవన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కౌలు రైతు భరోసా కార్యక్రమం పూర్తయిన వెంటనే, మరో రాజకీయ కార్యాచరణతో ముందుకెళ్లాలని ఆయన భావిస్తున్నారట.
పవన్ కనుక మరో పొలిటికల్ టూర్ పెట్టుకుంటే.. ఆయన చిత్రాలన్నీ ఆలస్యం అవ్వడం ఖాయం. ఇప్పటికే హరిహర వీరమల్లు ఆలస్యమైంది. సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్ సినిమాలు ప్రకటించినప్పటికీ వాటికి ఇప్పటివరకు కాల్షీట్లు కూడా కేటాయించలేదు. మధ్యలో పీపుల్ మీడియా బ్యానర్ పై వినోదాయశితం రీమేక్ కూడా చేయాల్సి ఉంది. ఇప్పుడీ సినిమాలన్నీ డైలమాలో పడ్డాయి.
నిజానికి పవన్ అనుకున్నట్టు కాల్షీట్లు కేటాయిస్తే, హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. పవన్ సెట్స్ పైకి వచ్చిన వెంటనే డేట్ ఎనౌన్స్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ పవన్ కాల్షీట్లు దొరకలేదని తెలుస్తోంది. ఆయన ఈ సినిమాకు మరో 10 రోజులకు మించి కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేదంట.