ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య నెలకొన్నపీఆర్సీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు అంగీకరించడంతో సమ్మె విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే.. ఉద్యోగుల నిర్ణయంపై టీచర్లు విభేధిస్తున్నారు. తమ డిమాండ్ల కోసం పోరాడతామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేన్నారు. జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపర్చకుండా ముందుకు వెళ్లిందని విమర్శించారు.
ఫిట్ మెంట్ పెంపు, హెచ్ఆర్ఏ, పీఆర్సీ నివేదక ఇవ్వడం వంటి ప్రధాన డిమాండ్లతో ఉద్యోగులు చేపట్టిన నిరసన అందర్నీ ఆలోచింపజేసిందని.. కానీ ఇవేమీ నెరవేరలేదన్నారు పవన్. ఐఆర్, హెచ్ఆర్ఏ, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగానే చేసినా ఉద్యోగులు సమ్మె విరమించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు.
ప్రభుత్వం శనివారం చేసిన ప్రకటనను ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని గుర్తుచేశారు పవన్. వారు ప్రస్తావించిన అంశాలను జనసేన పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.