ప్రజల సమస్యలు తీర్చని గ్రామ సచివాలయాలు ఎందుకని ప్రశ్నించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తమ పార్టీ ప్రశ్నిస్తే గానీ ప్రభుత్వానికి సమస్య గుర్తుకు రావడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు పవన్. యాత్రలో భాగంగా చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3 వేల మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు పవన్. 80 శాతం కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించకపోయినా.. తమ పార్టీ గుర్తిస్తుందన్నారు. కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. సమస్యలపై మాట్లాడితే.. తనను దత్తపుత్రుడు అని అంటున్నారని.. సీబీఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సెటైర్లు వేశారు.
వైసీపీపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్న పవన్… ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా నిలదీస్తామని స్పష్టం చేశారు. తాను పాలసీ, ప్రజల కష్టాలపై మాత్రమే మాట్లాడుతానని అన్నారు. తాను వస్తున్నానని ఒక సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతులకు పరిహారం ఇచ్చారని.. మిగిలిన వారిని వదిలేశారని ఆరోపించారు. జనసేన కావాలో, వైసీపీ కావాలో తేల్చుకోవాలన్నారు.
సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు టెక్నికల్ గా సాధ్యం కాదనడం ఏంటని మండిపడ్డారు పవన్. అహంకారంతో విర్రవీగితే ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని.. ప్రజల పన్నులతో వచ్చిన నిధుల్ని మీరు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వంపై విసుగెత్తి పోయిందన్నారు. అభివృద్ది అంటే బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లు అమ్మడమా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఘోరంగా పాలన చేస్తోందని ఆరోపించారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి కొత్త షాపుల్ని ఎలా తెరిపిస్తారని ఫైరయ్యారు పవన్.