పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు
అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుంది. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైంది. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు.
ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోంమంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి.