పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే ఒకప్పటి తమ్ముడు, ఖుషి, తొలి ప్రేమ లాంటి చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఆ సినిమాల్లో పవన్ యాక్టింగ్ కు అప్పటి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇప్పటికీ పవన్ నుంచి అలాంటి కథలు, అలాంటి నటననే కోరుకుంటున్నారు చాలామంది. అయితే అలాంటివి ఇకపై కుదరవని చెప్పేశాడు పవన్.
ఆల్రెడీ చేసేసిన మేనరిజమ్ ను మళ్లీ చేయడం తన వల్ల కాదని తెలిపాడు పవన్. పైగా 30 ఏళ్ల వయసులో చేసిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ను ఇప్పుడు చేయమంటే తన శరీరం సహకరించినా, మైండ్ సహకరించదని అనేశాడు. తన దగ్గరకొచ్చిన చాలామంది దర్శకులకు అదే చెబుతుంటానని, కాస్త మెచ్యూర్డ్ పాత్రలతో రావాలని, ఖుషి-తమ్ముడు ఛాయలతో కథలు వద్దని చెబుతుంటారట పవన్.
బాలయ్యతో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు పవన్ కల్యాణ్. రెండు భాగాలుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో పై విధంగా స్పందించాడు.
పవన్ చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే, ఇకపై రాబోయే సినిమాల్లో వింటేజ్ పవన్ కల్యాణ్ ను చూడడం దాదాపు అసంభవం అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ హీరో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు.