వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు ఎనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అంగీకరించిన సినిమాలు కాకుండా మరో సినిమా ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఇప్పుడు వీటికి అదనంగా మరో సినిమా కూడా తెరవెనక సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పవన్ కు అడ్వాన్స్ కూడా అందినట్టు చెబుతున్నారు.
ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫైనాన్షియర్, పవన్ చేతిలో భారీ మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో పెట్టినట్టు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ ను, దర్శకుడ్ని తీసుకురమ్మని పవన్ సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బడా ఫైనాన్షియర్, నిర్మాతను వెదికే పనిలో ఉన్నాడు. పలువురు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు.
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పై ఉంది. రేపోమాపో హరీశ్ శంకర్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఆ వెంటనే సురేందర్ రెడ్డి సినిమా కూడా వస్తుంది. ఈ గ్యాప్ లో జీ స్టుడియోస్ బ్యానర్ పై తమిళ సినిమా రీమేక్ ఒకటి ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇన్ని సినిమాల మధ్య మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కల్యాణ్.
ఎంత ఫాస్ట్ గా షూటింగ్ చేసినప్పటికీ, ఈ సినిమాలన్నీ పూర్తయ్యేసరికి 2024 కూడా సరిపోదు. కాబట్టి ఓవైపు ఎన్నికల్ని ఎదుర్కొంటూనే, మరోవైపు సినిమాల్ని కూడా కొనసాగించబోతున్నాడు పవన్ కల్యాణ్. ఇది ఫిక్స్.