ఏపీలో టెన్త్ పరీక్షల ఫలితాల వివాదం నడుస్తోంది. పాస్ పర్సంటేజ్ బాగా తగ్గడంపై ప్రభుత్వంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. సప్లిమెంటరీ ఫీజుల కోసం ఫెయిల్ చేశారంటూ సోషల్ మీడియాలో వైసీపీ సర్కార్ ను ఆడుకుంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉచితంగా రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపుల దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు ప్రభుత్వం డ్యూటీలు వేసిందన్నారు. అలాంటి ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలమని చురకలంటించారు. సిగ్గుపడే ఇలాంటి డ్యూటీలు చేయించి.. విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలు అంటూ విమర్శించారు.
పాఠశాలల్లో నాడు-నేడు అంటూ రంగులేస్తాం.. ఇంగ్లీష్ పాఠాలు చెప్పేస్తామంటే సరిపోదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు-నేడు కార్యక్రమానికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్నారు… ఫలితాలు చూస్తుంటే ఆ డబ్బులు ఎటు వెళ్లాయని అనిపిస్తోందన్నారు. సరైన ఉపాధ్యాయుడు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాలేదన్న పవన్.. విద్యా వేత్తలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని విద్యా ప్రణాళిక తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులతో అనవసర పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వాటి వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం ఉండటం లేదన్నారు.