‘భారతదేశం గొప్పతనాన్ని తెలియజేసే సినిమా సైరా నరసింహారెడ్డి…’ అని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ వేడుకలో పవన్‌కల్యాణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన అన్నయ్య గురించి, ఈ సినిమా గురించి పవన్‌కల్యాణ్ తన స్పీచ్‌లో ఆసక్తిదాయకంగా మాట్లాడారు.
‘నాకంటే చిన్నవాడైన రామ్ చరణ్.. నా ముందు పుట్టి పెరిగిన రామ్ చరణ్.. ఎటువంటి స్వార్థం చూసుకోకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు రామ్‌చరణ్‌కు అభినందనలు తెలియజేస్తున్నా..’ అన్నారు పవన్‌కల్యాణ్. సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవర్‌స్టార్ ప్రసంగం ఎంతో ఉత్తేజితంగా సాగింది. అన్న గురించి తమ్ముడు ఏం మాట్లాడుతాడా అని మెగాస్టార్ సహా అందరూ ఆసక్తిగా పవన్‌కల్యాణ్ ప్రసంగాన్ని విన్నారు. నిజం చెప్పాలంటే మెగాస్టార్ ప్రసంగానికి మించిన రెస్పాన్స్ పవర్‌స్టార్ ప్రసంగానికి వచ్చింది.
‘ఇది కేవలం వినోదం కోసం మాత్రమే చేసిన సినిమా కాదు. గత నాయకులు ఎంతో త్యాగం చేయబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం అని తెలుసుకోవాలి. వాళ్లు ప్రాణాలు కోల్పోయి మనకు ఇలాంటి ప్రజాస్వామ్యం కల్పించారు. అసువులు బాసారు. రక్తం దారపోశారు. అలాంటి చరిత్రను అద్భుతంగా తెరకెక్కించాలంటే చాలా కష్టపడాలి..’ అని పవన్‌కల్యాణ్ తన ప్రసంగంలో అన్నారు.
‘ఎప్పుడూ భారతదేశం ఇతర దేశాలపై దాడి చేయలేదు. ప్రపంచ దేశాలన్నీ వచ్చి మన మీద దాడి చేశాయి కానీ, మన దేశం మాత్రం ఏనాడూ ఇతర దేశంపై దాడి చేయలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాంటి వ్యక్తుల సమూహమే భారతదేశం. ఆయన ఎలా ఉన్నాడో, ఎలా పోరాటం చేశాడో మనకు తెలియదు. చరిత్రను విజువలైజ్ చేసుకోగలిగే వ్యక్తులు ఒక పుస్తకం చదివితే అర్థం చేసుకోగలరు కానీ, కోట్లాది మందికి ఆ అనుభూతి రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. చరిత్రలో ఎంత మంది కష్టపడ్డారు. వారు దేశం కోసం ఏం చేశారు, ఎందుకు ప్రాణాలర్పించారు అనేది ఇలాంటి సినిమాల వల్ల తెలుస్తుంది. భగత్ సింగ్, ఆజాద్, జతిన్, మహాత్మా గాంధీ, పటేల్, అంబేడ్కర్ వంటి వారి చరిత్రలు, దేశం కోసం వారు చేసిన త్యాగం మనకు ఎంతో నేర్పిస్తాయి. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర కూడా అలాంటిదే..’ అని జన సేనాని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది.