ఎన్టీఆర్ గురించి ఎంతమంది ఎంత గొప్పగా చెప్పినా మెగా హీరోల నుంచి ఒక్క మాట వస్తే చాలన్నట్టు అందరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే చిరంజీవి కానీ, అతని తమ్ముళ్లు నాగబాబు, పవన్‌కల్యాణ్ కానీ, యన్టీఆర్ గురించి మాట్లాడ్డం చాలా తక్కువ సందర్భాల్లోనే విన్నాం. అనేక సందర్భాల్లో నాగబాబు అయితే మీ అభిమాన నటుడు ఎవరని అడిగితే ఎస్‌వీ రంగారావు అని తడుముకోకుండా సమాధానం చెప్పేస్తారు. పౌరాణికాల్లో యస్వీఆర్‌ను మించిన నటుడు లేరన్నది నాగబాబు నిశ్చితాభిప్రాయం. ఇలావుంటే, పవర్‌స్టార్ నోటమ్మట ఇప్పుడు యన్టీఆర్ ప్రస్తావన వచ్చిన సందర్భం అపూర్వం. అది సైరా ప్రీరిలీజ్ వేడుకలో జరిగింది.
అనుభవానికి తాను చాలా పెద్దపీట వేస్తానని పవన్‌కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన అన్నయ్య చిరంజీవిపై ప్రశంసల్లో ముంచెత్తారు. కొత్త హీరోలు ఎంత మంది వచ్చినా చిరంజీవి లాంటి హీరో అనుభవం ముందు వాళ్లంతా నిలవలేరని సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా యన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.
‘అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇదెప్పుడు నేర్చుకున్నానంటే.. అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తరవాత. చిరంజీవి గారికి చాలా బలమైన స్టార్‌డమ్ స్టార్టయినప్పుడు ఒక తమ్ముడిగా మా అన్నయ్య చాలా పెద్ద హీరో అని అనుకున్నాను. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారి ‘విశ్వామిత్ర’ సినిమా వచ్చింది. ఆ సినిమా అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. ఆరోజు నాకు అర్థమైంది ఏంటంటే.. ఒక వ్యక్తి తాలూకా అనుభవాన్ని ఎప్పుడూ తీసేయలేం. అలాగే ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా, ఎంత మంది రికార్డులు బద్దలుకొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని కొట్టేయలేం’ ఇదీ పవన్‌కల్యాణ్ ప్రసంగంలో అన్న, అన్నయ్యల ప్రస్తావన.