వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎన్నో రకాలుగా ఆలోచించే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. మంగళగిరి కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జనసేన కీలక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. తాము ఎవరి పల్లకీలు మోయడానికి రాలేదన్నారు. ప్రజలను పల్లకీలు ఎక్కించడానికే ఉన్నామని చెప్పారు.
వైసీపీ నేతల అరాచకం, దోపిడీ వల్ల ఏపీ శ్రీలంకలా మారుతోందని విమర్శించారు పవన్. మద్యాన్ని నిషేధిస్తామని అధికారంలోకి వచ్చి ప్రత్యేక రేటుకు అమ్ముతున్నారని మండిపడ్డారు. జనసేన ఏనాడూ ఓట్ల కోసం కార్యక్రమాలు చేపట్టదని.. ప్రభుత్వాలని మార్చుకునే సమయంలో జరిగే ప్రక్రియలో భాగమే ఓట్లని జనసేన భావిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
కాన్షీరాం స్ఫూర్తితో జనసేనను ముందుకు తీసుకెళ్తున్నానని తెలిపారు పవన్. ఈ ప్రయాణంలో జనసేన నేతలు.. కార్యకర్తలే తనకు కొండంత బలమన్నారు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా కౌలు రైతులను చనిపోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 350 మంది మరణించారని చెప్పారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో అన్ని సామాజిక వర్గాల వారూ ఉన్నారని.. అన్నం పెట్టే రైతుకు కులాలు అంటగడతారా అని ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని కౌలు రైతుల కోసం ఇచ్చానన్న పవన్.. అన్నం తినే ప్రతి ఒక్కరికీ రైతు కష్టం అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తామన్నారు. జనసైనికులెవ్వరూ ప్రభుత్వానికి భయపడొద్దని సూచించారు.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు పవన్. ఏప్రిల్ 12 నుండి ఈ పరామర్శ యాత్ర అనంతపురం నుంచి ప్రారభం కానుంది. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో 1,857 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తొలి ఏడాది 1019 మంది, రెండో ఏడాది 838 మంది చనిపోయారని వివరించారు. సీఎం జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తే ప్రతీ రైతు నిరసన తెలుపుతారని సెటైర్లు వేశారు.
విస్తృతస్థాయి సమావేశంలో జనసేన తీర్మానాలు
1. అమరావతిలోనే రాజధాని వుండాలి
2. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం
3. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లో కేంద్ర, రాష్ట్ర పన్ను వాటా తగ్గించాలి
4. మహిళల భద్రత, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టాలి
5. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష సాయం