– ప్యాకేజీ పేరెత్తితే..
– జన సైనికుల చెప్పుతో కొడతా!
– ముూడు ముక్కల సీఎంకు భయపడం
– వైసీపీ వేస్ట్ గాళ్లకు బెదిరేది లేదు
– సెట్ అయితేనే పొత్తులు.. లేదంటే ఒంటరిగానే..!
– జనసేన యువశక్తి సభలో పవన్ నిప్పులు
శ్రీకాకుళం, తొలివెలుగు:రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రణస్థలం వేదికగా జనసేన పార్టీ యువశక్తి సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. మనల్నిఎవడ్రా ఆపేది అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్. గెలుస్తానో ఓడిపోతానో కాదు.. తనకు పోరాటమే తెలుసన్నారు. వెధవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం తెలుసని చెప్పారు.
ఈ సందర్భంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. దశాబ్దం పాటు ఒంటరిగా పోరాడానని.. తనకు బలం సరిపోతుంది అనుకుంటే ఒంటరిగానైనా వెళ్తానన్నారు. అయితే.. ఆ నమ్మకం మీరు ఇస్తారా? అని ప్రజలను అడిగారు. ఒంటరిగా వెళ్లి వీరమారణం పొందటం అవసరం లేదు.. నియంతను కలసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ఓటు చీలకూడదని.. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. లేకపోతే ఒంటరిగానే పోటీకి సిద్ధమని స్పష్టంచేశారు.
ఇది మూడు ముక్కల ప్రభుత్వమని.. జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేశారు పవన్. తాను వైఎస్ నే ఎదుర్కొన్నానని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండని చెప్పానన్నారు. తనను భయపెట్టాలని చూసినా, దాడులు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే.. జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతానన్నారు. తాను బతికున్నంత వరకు వైసీపీ గూండాలతో యుద్ధం చేస్తానని చెప్పారు.
తన గురించి మాట్లాడే వాళ్లను ఒక్కర్ని కూడా మర్చిపోనని.. తన వాళ్లూ మర్చిపోరని తెలిపారు పవన్. కులంకోసం వచ్చినవాడిని కాదన్న ఆయన.. తెలుగు నేల, దేశం బాగుండాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. జైలుకెళ్లిన ఖైదీ నెంబర్ 6093 కూడా తన గురించి మాట్లాడితే ఎలా అంటూ సెటైర్లు వేశారు. రాజు సరైనోడు కాకపోతే సగంరాజ్యం నాశనం అవుతుందని.. సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనం అవుతుందని చురకలంటించారు. మంత్రులపైనా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు పవన్. డైమండ్ రాణి అంటూ రోజాను, సంబరాల రాంబాబు అంటూ అంబటి రాంబాబును ప్రశ్నించారు. ఐటీ మంత్రి పేరెత్తేందుకు కూడా అసహ్యం వేస్తోందని అన్నారు పవన్.