తెలంగాణలో జనసేన ప్రజాయాత్ర మొదలు కానుంది. ఈ నెల 24 వ తేదీన కొండగట్టు ఆంజనేయుని సందర్శన అనంతరం జనసేనాని ఈ యాత్రను ప్రారంభిచనున్నారు. తొలుత కొండగట్టు ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజలు జరపించాలని జనసేన నిర్ణయించడం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
కొండగట్టు ఆంజనేయునిపై ఉన్న అంచంచల భక్తి, విశ్వాసాల కారణంగా పవన్ ఈ క్షేత్రాన్ని దర్శించనున్నారు. 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగలి ప్రమాదానికి గురి కాగా.. కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ నమ్ముతారు.
అందువల్ల పవన్…తాను తలపెట్టిన అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారు.ఈ నేపథ్యంలో రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహి వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. పూజా కార్యక్రమం అనంతరం, తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు. కాగా, ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్‌కళ్యాణ్ సంకల్పించారు.
ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్‌కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన ప్రకటనలో వెల్లడించింది.