కొవిడ్ ప్రమాదాన్ని పాక్స్ లోవిడ్ మాత్ర 89శాతం తగ్గించగలదని ఇటీవల క్లీనికల్ ట్రయల్స్ డేటాలో వెల్లడైంది. దీనికి సంబంధించిన విషయాలను ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించింది.
వ్యాక్సిన్ తీసుకోకుండా కొవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చేరని వ్యక్తులపై 2,3వ దశ క్లీనికల్ ట్రయల్స్ ను ఫైజర్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడైనట్టు శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం..
మొత్తం 2246 మందిలో 1120 మంది పేషెంట్లకు 300 గ్రాముల నిర్మాట్రెలీవర్, 100 గ్రాముల రిటోనావిర్ ను ఇచ్చారు. మిగిలిన 1126 మందికి నకిలీ మాత్ర(ప్లేసీబో)ను వేశారు. ఇలా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున 5 రోజుల పాటు మాత్రలు అందించారు.
ఆ తర్వాత 28 రోజుల పాటు వైరల్ లోడ్, కొవిడ్ సంబంధిత కారణాలతో ఆస్పత్రిలో చేరడం, ఏదైనా కారణంతో మరణం సంభవించడం వంటి అంశాలపై 28 రోజుల పాటు పరిశీలనలు చేశారు.
కొవిడ్ లక్షణాలు కనిపించిన తర్వాత మూడు రోజుల లోపు చికిత్స అందించిన వారిలో కొవిడ్- సంబంధించి ఆస్పత్రిలో చేరడం లేదా మరణం సంభవించడం అనేది నకిలీ మాత్రతో పోలిస్తే నిర్మాట్రెలీవర్ సమూహంలో చాలా తక్కువగా ఉన్నట్టు తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
5 రోజుల తర్వాత ట్రీట్ మెంట్ అందించిన వారిలో ప్లేసిబోతో పోలిస్తే నిర్మల్ ట్రెలీవర్, రిటోనావిర్ తీసుకున్న వారిలో వైరల్ లోడ్ తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక ప్లేసిబో తీసుకున్న వారిలో 13 కొవిడ్ మరణాలు సంభవించగా, నిర్మాట్రెలీవర్ తీసుకున్న వారిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.
‘ కొవిడ్ లక్షణాలు కనిపించిన 3, 5 రోజుల తర్వాత చికిత్స ప్రారంభించిన వారిలో 88.9 శాతం, 87.8 శాతం రిస్క్ తగ్గిపోయింది. నిర్మాట్రెలీవర్, రిటోనావిర్ తీసుకున్న వారిలో కొవిడ్ తో ఎవరూ మరణించలేదు. ప్లేసిబో తీసుకున్న వారిలో 13 కొవిడ్ మరణాలు సంభవించాయి” అరి శాస్త్రవేత్తలు వెల్లడించారు.