ప్రజల గొంతుకగా ప్రభుత్వంపై సైరన్ మోగించటానికి కాంగ్రెస్ రెడీ అయ్యిందని, మొదట నిరుద్యోగ సైరన్ మోగిస్తున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 9వరకు జరుగుతుందన్నారు. ఏ ఆకాంక్ష కోసం బలిదానాలు చేసుకున్నారో ఆ ఆకాంక్ష కేసీఆర్ నెరవేర్చడం లేదని, నిరుద్యోగ యువత కోసమే తమ పోరాటమన్నారు.
తెలంగాణ తల్లి కేసీఆర్ ఫాంహౌజ్ లో బందీగా మారిందని, కేసీఆర్ 14 ఎఫ్ తొలగింపు కోసం చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చారు తప్ప.. తెలంగాణ కోసం కాదన్నారు. కానీ ఉధృతమైన తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ వస్తుందని ఉహించి ఆ క్రెడిట్ తనకు రావడం కోసం కేసీఆర్ 2014లో ఆమరణ దీక్ష పేరుతో దొంగ దీక్షకు దిగారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ యువతను సిద్దిపేటలో హరీష్ రావు పెట్రోల్ పోసుకుని రెచ్చగొట్టాడని, నిరుద్యోగుల ఆత్మ బలిదానాలకు హరీష్ రావే బాద్యుడని మండిపడ్డారు. 100 రూపాయలతో పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకున్న హరీష్ కు ఆటాన అగ్గిపెట్టే దొరకలేదా అని ఎద్దేవా చేశారు.
పేదలకు చదువును దూరం చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదని విమర్శించిన రేవంత్, కేజీ టూ పీజీ విద్య హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఫీ రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, గోర్లు, బర్లు, చేప పిల్లలు, సన్న బియ్యం కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది… 7 ఏళ్ళు అయినా ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ లక్ష రూపాయల నిరుద్యోగ భృతి బాకీ పడ్డారని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగ యువత కోసమే జంగ్ సైరన్ అని, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న దిల్ సుఖ్ నగర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీకాంత చారి అమరుడైన ఎల్బీనగర్లో సభ నిర్వహిస్తామని, అమరుడు శ్రీకాంతాచారి స్పూర్తిగా ఈ పోరాటం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు.