పోలీసులకు మస్కా కొట్టడంలో రేవంత్ ను మించిన వారు లేరేమో. ఇంతకుముందు చాలా సందర్భాల్లో వాళ్లకు ఝలక్ ఇచ్చి తాను అనుకున్న చోటకి వెళ్లారాయన. తాజాగా మరోసారి చేసి చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు రేవంత్ వెళ్లారు. అయితే.. ఆయన వస్తున్నారని తెలిసి పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుగా నిలబడ్డారు. దీన్ని గ్రహించిన రేవంత్ రూటు మార్చారు.
ముందుగా మహారాష్ట్రలోని ధర్మబాద్, బాలాపూర్ మీదుగా ట్రిపుల్ ఐటీ వద్దకు చేరుకున్నారు రేవంత్. అక్కడ కాలినడకన చెరువులో నుండి నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో పొలంలో ట్రాక్టర్ ఎక్కారు. ముళ్ల పొదల్ని దాటుకుంటూ.. పోలీసుల కళ్ళుగప్పి ఎట్టకేలకు క్యాంపస్ వెనుక నుంచి గోడదూకి లోపలికి చేరుకున్నారు.
విద్యార్థులు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లేందుకు చూశారు రేవంత్. అయితే.. ఆయన్ను గుర్తించిన పోలీసులు వెంటబడి అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి.. ఉన్నతాధికారులను రమ్మని చెప్పారు. కొంతదూరం ముందుకు వెళ్లాక.. పోలీసులు చుట్టుముట్టి రేవంత్ ను పైకిలేపి కారులో కూర్చోబెట్టారు.
Advertisements
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు లోకేశ్వరం పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసుల తీరుపై మండిపడ్డ ఆయన.. విద్యార్థులను ఎందుకు కలవనివ్వడం లేదని ప్రశ్నించారు.