ఇప్పుడు రాలేకపోయినా… గంట ముందు ఎప్పుడు, ఎక్కడో చెప్పినా తను డ్రగ్స్ పరీక్షలకు వస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు మార్గదర్శకంగా ఉన్న మనం బహిరంగంగా డ్రగ్స్ పరీక్షలు తీసుకునే టెస్టులు చేసుకుంటే తప్పేముంది… ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు రాహుల్ ను రమ్మని… తీరా ఆయన వస్తా అన్నాక ఇవాంకా ట్రంప్ ను రమ్మంటే ఎక్కడ నుండి టెస్టులకు తేవాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేటీఆర్ ఇప్పుడు కోర్టుకెళ్తా అంటున్నారు… నేను 2017లో కోర్టుకు వెళ్తే ఈడీ వివరాలు అడిగినా మీ ఎక్సైజ్ శాఖ ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ తనే స్వయంగా రక్తపరీక్షలకు రెడీ అంటేనే నేను వైట్ ఛాలెంజ్ విసిరా అని… ఎంతో పేరున్న కుటుంబం నుండి వచ్చిన మాజీ ఎంపీ కొండా ముందుకు వచ్చి, కేటీఆర్ రాలేదంటే అర్థం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ నాకన్నా అరగంట ముందే వస్తాడనుకున్నానన్నారు. సినీ నటులను ఈడీ విచారణకు పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో 6 పబ్బులుంటే… ఇప్పుడు 60 పబ్బులయ్యాయని, కేసీఆర్ ఒక్కసారి శనివారం రాత్రి 11గంటల తర్వాత సెక్యూరిటీ లేకుండా వెళ్తే రోడ్లపై పరిస్థితులు ఎంత ఘోరమో కనపడతాయన్నారు.
కొండా విజ్ఞప్తి మేరకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా టెస్టులకు ఒప్పుకొని మెరుగైన సమాజ నిర్మాణానికి ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు.