– పాస్ బుక్స్ లేవు.. రైతు బంధు రాదు..
– పంట బీమా ఇవ్వరు..
– ధరణి కష్టాలు తీరవు..
– లక్ష్మాపూర్ ప్రజలు చేసిన నేరమేంటి?
– వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– నెల రోజుల్లోనే పాస్ బుక్స్ పంపిణీ చేస్తాం
– లక్ష్మాపూర్ రచ్చబండలో రేవంత్
కేసీఆర్ గద్దె దిగితేనే రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లక్మాపూర్ లో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు రోజులు కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ సంతోషంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటిస్తే ఇదే సంతోషాన్ని అలాగే కంటిన్యూ చేసుకోవచ్చని చెప్పారు. లక్ష్మాపూర్ ను సీఎం దత్తత తీసుకున్నారని.. ధరణి పోర్టల్ ను ఇక్కడి నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు.
కేసీఆర్ దత్తత గ్రామంలోనే సమస్యలు తిష్ట వేసి ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు రేవంత్. గ్రామంలో 582 మందికి ఖాతా నెంబర్లు లేవని.. రైతు బంధు, బీమా రావడం లేదని చెప్పారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులకు చాలా నష్టాలు జరుగుతుతున్నాయని.. గ్రామంలో పూర్తిగా సర్వే చేయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తోపాటు మంత్రి మల్లారెడ్డిపైనా విరుచుకుపడ్డారు రేవంత్. మల్లారెడ్డి, ఆయన బావమరిది భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతిపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామన్నారు.
కేసీఆర్ తన ఫాంహౌస్ కు రోడ్డు వేస్తే.. గ్రామంలో కుమ్మరి ఎల్లవ్వ ఇల్లు పోయిందని.. ఒక్క ఇల్లు కట్టిస్తే నీ ముల్లె ఏమన్నా పోతుందా? అని ప్రశ్నించారు. కలెక్టర్ దీనిపై స్పందించి.. ఇల్లు కట్టివ్వకపోతే కాంగ్రెస్ తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాగానే నెల రోజుల్లో ఇదే గ్రామంలో అందరికీ పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. కేసీఆర్ నిజాయితీపరుడు అయితే తన ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలన్నారు. వాటిని నిరూపించలేకపోతే ఎలాంటి చర్యకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల వద్దకు వచ్చి క్వింటాల్ వరి ధాన్యం రూ.2,500 కొంటామని హామీ ఇచ్చారు రేవంత్. అలాగే అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొంటామని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత 15 రోజులు ఫాం హౌస్ లో తాగి పడుకొని ఇపుడు ఇప్పుడు ఢిల్లీకి పోయి పంజాబ్ రైతులకు చెక్కులు ఇచ్చారని విమర్శించారు. “మనం పన్నులు కడితే మన రైతులకు పరిహారం ఇవ్వరు.. ఇక్కడి కుమ్మరి ఎల్లమ్మకు ఇల్లు ఇవ్వరు.. కానీ పంజాబ్ కుపోయి అక్కడి రైతులకు చెక్ లు ఉస్తారట. ఇక్కడి రైతులకు న్యాయం చేయనోడు పంజాబ్ లో ఎలాగబెడుతాడట. ఇక్కడి సమస్యలు పరిష్కరించి ఇతర ప్రాంతాలకు పోతే మాకు అభ్యంతరం లేదు. ఇక్కడి రైతులు నానా కష్టాలు పడుతుంటే పంజాబ్ రైతులకు రాజకీయ స్వార్థం కోసం చెక్ లు ఇచ్చి రాజకీయాలు చేస్తుండు. రైతు డిక్లరేషన్ ను 12 వేల గ్రామాలలో ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది” అని చెప్పారు రేవంత్ రెడ్డి.