తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అమ్మిన కోకాపేట్ ఖానామెట్ భూముల అమ్మకంలో అవినీతి జరిగిందని ఆరోపించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆధారాలతో సహా సీబీఐ డైరెక్టర్ ను కలిసి విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, కేసీఆర్ తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ అవినీతిపై రాహుల్ గాంధీకి చెప్పి… సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. కోవిడ్ నిబంధనలతో సీబీఐ డైరెక్టర్ ఒకరికే అనుమతి ఇవ్వటంతో తానే స్వయంగా ఫిర్యాదు చేసి వచ్చానన్నారు. ఇప్పటికే ప్రధాని, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరామని… వారు సమయం ఇస్తే వారికి కూడా ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కేసీఆర్ కు సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ లు జయేష్ రంజన్, అరవింద్ కుమార్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎలా సహకరించారో కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ మొత్తం అవినీతి వ్యవహరంలో మైహోం సంస్థకు, వెంకట్రామ్ రెడ్డికి చెందిన రాజ్ పుష్ప కంపెనీతో పాటు మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ సోదరుడికి భారీ లాభం చేకూర్చారని రేవంత్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భూములు దక్కించుకున్న కంపెనీల వివరాలు కూడా సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ టెండర్లు పిలిచినా రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ తోనే చేయాలని గతంలో ఆదేశించిన సీఎస్… ఇక్కడ మాత్రం ఎన్నో అవినీతి ఆరోపణలున్న కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా టెండర్లు పిలిచారని, పైగా రాష్ట్ర ప్రభుత్వానికి 12.5కోట్లతో ఖర్చుతో పోయేదాన్ని కేంద్ర ప్రభుత్వ సైట్ కోసం ఏకంగా 50కోట్లు ఫీజు చెల్లించారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన వారికే భూములు దక్కాయన్నారు.
కేసీఆర్ ను అవినీతి చేశారని, జైలుకు పంపుతామంటూ బీజేపీ నేతలు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి ఎన్నోసార్లు ఆరోపించారని… ఇప్పుడు మేం సీబీఐకి ఫిర్యాదు చేసినందున విచారణ జరిగేలా మీరు మీ నాయకత్వంపై ఒత్తిడి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మీ పాదయాత్రలను ప్రజలు నమ్మాలంటే ఇదే సరైన సమయం అని హితవు పలికారు.
సీబీఐకి రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు కాపీ
Advertisements