టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సై ని కలిసిన ఆయన.. పేపర్ లీక్ లో జరిగిన అవతవకలపై ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు రేవంత్. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని ఆరోపించారు.
టీఏస్పీఏస్సీ పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు రేవంత్. దీనిపై సమగ్రంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ పేపర్ లీక్ లో కీలకపాత్ర మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదేనని విమర్శించారు. మంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామని తెలిపారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీం ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామని వివరించారు.
ఇప్పుడు ఉన్న టీఏస్పీఏస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందన్న రేవంత్.. అందరిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్టు తెలిపారు. ఈ కేసులో పారదర్శక విచారణ చేస్తామని భావించామని.. కానీ, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్ కు ఉందన్నారు.
కేటీఆర్, జనార్ధన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరినట్టు తెలిపారు రేవంత్. గవర్నర్ వేశేష, విచక్షణ అధికారులు ఉపయోగించాలని కోరగా.. లీగల్ ఓపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని అన్నారు.